omThis translation has been contributed by Brother Ashok. Original post in English can be found here http://agniveer.com/common-questions-vedic-religion/

ఇప్పుడు మనం  ముందుగా ‘వైదిక ధర్మమనగానేమి?’ అనే వ్యాసంలో (http://agniveer.com/5095/what-is-vedic-religion/) చర్చించబడిన కొన్ని తప్పుడు ప్రశ్నలు వాటి సమాధానాలను విశ్లేషణ చేసి, వైదిక ధర్మం యొక్క ముఖ్యంగా తెలుసుకోదగిన కొన్ని విషయాలను అర్థం చేసుకుందాం.

ఏ విధంగా వైదిక ధర్మం హిందూత్వం కంటే భిన్నమైనది?

చాలా కారణాలు:

  • వైదిక ధర్మానికి 4 వేదాలతో సంబంధం ఉందనుకున్నా లేక లేదనుకున్నా, ‘హిందూత్వం’ అనే పదం మనకెక్కడా వాటిలో కనపడదు. కొన్ని యుగాల చరిత్రను మనం పరిశీలన చేస్తే ఇది ఇటీవలే వాడుకలోకి వచ్చినది అనే సత్యం మనకు అవగతమవుతుంది. ఆ విధంగా వేదాలు హిందూత్వానికి మాత్రు సమానమైనవి.
  • హిందూత్వానికి ఉన్న చాలా వ్యాఖ్యానాలలో ఒకటి ‘హిందూస్తాన్’ లేక భారత ఉపఖండం మరియు దాని సంస్కృతి పట్ల నిబద్ధతతో ఉండటం. కానీ వైదిక ధర్మం ప్రతి మానవునికి చెందినది – వారు భారత దేశానికి చెందినవారైనా లేక జాంబియా లేక స్వీడన్ లేక సౌదీ అరేబియా లాంటి దేశాలకి చెందినవారైనా, వారందరికీ సంబంధించినది.
  • హిందూత్వానికి ఉన్న మౌలిక సారము వేదాల నుండే ఉద్భవించినది అనే మాట సత్యం. కానీ ఎవరెవరు సత్యాన్ని స్వీకరించి అసత్యాన్ని త్యజించటమనే ప్రాథమిక సూత్రానికి కట్టుబడి ఉంటారో, వారు ఎప్పుడూ భారత దేశాన్ని సందర్శించక పోయిననూ, ఏ భారత గ్రంథాలను చదవక పోయిననూ, వారందరినీ ‘వైదికులు’ అనవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక స్వచ్చమైన హిందువు వైదికుడే కానీ అందరు వైదికులూ హిందువులు కానక్కరలేదు.

 

ఎవరైనా నాలుగు వేదాలను విశ్వసించకపోయిననూ, వైదిక ధర్మాన్ని అనుసరించగలరా?

అవును. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

వేదాలను మొత్తం పరిశీలిస్తే ఏ ఒక్క మంత్రంలోనూ,  ఎక్కడా పరోక్షంగా కూడా, 4 వేదాలను నమ్మితేనే వైదిక ధర్మాన్ని పాటిస్తున్నట్టు చెప్పబడలేదు. అవును, వైదిక ధర్మం మరియు వేదాలలోని అంశాలు రెండూ ఒకటేనని మనకు వివరిస్తూ మార్గదర్శనం చేస్తూ నిర్ధారణ చేసే మంత్రాలు ఉన్నాయి.

4 వేదాలూ, అత్యున్నత స్థాయి సత్య స్మృతులను కలిగి ఉన్నాయి. అవి వివరణాత్మక భౌతిక శాస్త్ర పాఠాలులాగా ఉంటాయి. వాటిలో చాలా స్పష్టమైన అంశాలు మరియు కఠోర సాధన ఇంకా అవగాహనతో మాత్రమే తెలుసుకోగల చాలా సూక్ష్మమైన అంశాలు ఉన్నాయి. అవి వైదిక ధర్మానికి పునాదులు లేక మూలాధారం వంటివి.

అయితే ఏ విధంగా ఒక 6వ తరగతి విద్యార్థి ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం (గూగుల్ నుండి కూడా దిగుమతి చేసుకోవచ్చు) యొక్క పాఠం మాత్రం బట్టీకొట్టి నేర్చుకొని తనకు భౌతిక శాస్త్రమంతా తెలుసునని ప్రగల్భాలు పలికితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అలాగే ఎవరైనా వేదాలంటే ఏంటో తెలుసుకోకుండా 4 వేదాలను నేను నమ్ముతాను అని చెబితే అంటే హాస్యాస్పదంగా ఉంటుంది.

ఈ రోజు వైదిక ధర్మాన్ని అనుసరిస్తున్నాం అని చెప్పుకొనే చాలా మంది వాస్తవానికి ఈ కోవకి చెందుతారు. అందుకే వారెంత ఢాంభికంగా గొప్పలు చెప్పుకున్నా, వారి సామర్థ్యం, సమాజం పై వారి ప్రభావం  చాలా  హీనమైన దయనీయ స్థితిలో ఉంటుంది.

ఒక నిజాయితీపరుడైన చురుకైన వైదికుడు, అందుబాటులోని సమాచారాన్ని తర్కంతో విశ్లేషిస్తే వేదాలు ఏదో కొందరి మానవుల యాదృచ్ఛిక సృష్టి కాదని, అందుకు బదులుగా  ప్రాథమిక  స్థాయి నుండి అత్యంత ఆధునిక స్థాయి జ్ఞాన కోశాగారాలని చాలా సరళంగా ఉద్ఘాటించగలడు. అలా పరిగణించకూడదనుకుంటే, కొంతవరకు ప్రతి యొక్క సిద్ధాంతానికి మరోదానితో కఠోర వైరుధ్యాలు మరియు గందరగోళాలు కలిగి ఉండి, ఏది నిజమో ఏది తప్పో నిర్ణయించుకోవటం అసాధ్యమవుతుంది. అందుచేత మనం వేదాల అర్థాన్ని సరియైన రీతిలో అన్వేషించే ప్రయత్నం చెయ్యాలి.

అయితే ఇది ఒక్క ఆలోచనా ప్రక్రియ ద్వారా కలిగే నిర్ధారణ వల్ల జరగగలదు కానీ గుడ్డి విశ్వాసాల వల్ల ప్రారంభం కాజాలదు.

ముందస్తు జ్ఞానం, గత అనుభవాలు, ఆలోచనా సామర్థ్యం, ప్రాధాన్యతలు వంటివి అనేక కారణాలు, ఒక మనిషి యొక్క ఆలోచనా ప్రక్రియను ప్రభావితం చేయవచ్చుగనుక, మనలో కొందరికి అనిపించినంతగా, ప్రతి ఒక్కరికీ వేదాలను దివ్యమైనవిగా లేదా అత్యున్నతమైన గ్రంథాలుగా అంగీకరించుటకు వీలు కాకపోవచ్చు.

స్వామి దయానంద సరస్వతి ఒక సందర్భంలో, ప్రతి ఒక్కరూ పండితులు కాక పోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ ధర్మాత్ములు అవ్వగలరని అన్నారు. కనుక ఎవరైనా వారి వారి ఉన్నత ఉద్దేశాలకు నిజాయితీగా కట్టుబడి ఉండి, వేదాల ఖచ్చితత్వాన్ని విశ్వసించకపోయినప్పటికీ వారు ఇంకా వైదికంగా ఉన్నట్లే పరిగణించవచ్చు. నిజానికి వారు, ఈ విధంగా చెప్పబడినదని గుడ్డి విశ్వాసాలతో వైదిక ధర్మాన్ని పాటించేవారికన్నా ఎక్కువ వైదికంగా ఉన్నట్లు భావించవచ్చు. ఎందుకంటే అలా గుడ్డి నమ్మకాలు గలవారు వేరే ఏ ఇతర ప్రాంతంలో జన్మించివున్నా, వారు బహు చక్కగా అక్కడి ఇతర గ్రంథాలను, అక్కడి విషయాలను అంటే గుడ్డిగా నమ్మి పాటిస్తూ వుండేవారు.

వేదాలపై నమ్మకం ఉంటేనే వైదిక ధర్మాన్ని పాటించటం అని అన్నట్లయితే, దాని అర్థం ఏంటంటే ఎవరికైనా ఆ నాలుగు వేద గ్రంథాలు, భౌగోళికమైన, సామాజికమైన దారిద్ర్యం వంటి పలు కారణాల వల్ల అందుబాటులో లేకుంటే, వారు ఎన్నటికీ వైదిక ధర్మానుచరులు కాలేరు. అప్పుడు వైదిక ధర్మం అదృష్టవంతుల ధర్మం మాత్రమే అవుతుంది. అటువంటప్పుడు, వేద జ్ఞానం లింగ, వర్ణ, జాతి, వృత్తి, పుట్టుక అనే భేదాలు లేకుండా సమస్త మానవాళికీ చెందినది, అనే వేదంలోని దైవ వాక్కు అసత్యమవుతుంది!

వాస్తవానికి, నాలుగు వేదాలలోని అంతరార్థం ఏంటంటే వాటిలోని జ్ఞానం మనలో కూడా ఇప్పటికే ఉన్నది. ఒక చక్రం కేంద్రకానికి అన్ని చువ్వలు ఏ విధంగా అమర్చబడి ఉంటాయో, అలా ఈ జ్ఞానం కూడా మనలోనే ఉన్నది. మనస్సు యొక్క శక్తిని సరిగ్గా వినియోగిస్తే, మనలో అంతర్గతంగా ఉన్న ఆ జ్ఞానాన్ని బహిర్గతం చేసుకోవచ్చు. యజుర్వేదంలోని 34.5 శ్లోకం  చదవండి. కనుక బాహ్యంగా నాలుగు వేదాలను చదవటం కూడా మనలోని జ్ఞానాన్ని బహిర్గతం చెయ్యటంలో తోడ్పడుతుంది. అందుకోసం 4 వేదాలను బట్టీ కొట్టి, అరుస్తూ శ్లోకాలను వల్లెవేస్తూ ఎవరైనా వారికి వేదాల పట్లనున్న విధేయతను చాటుకోవచ్చు. లేదా, సక్రియాత్మకంగా అసత్యాన్ని తిరస్కరించే అత్యంత అంతర్లీనమైన సహజ లక్షణంతో మొదలు పెట్టి, జ్ఞానాన్ని పొందుతూ శ్రేష్టమైన పనులు చేస్తూ ఒక మౌలికమైన పునాదిని నిర్మించుకోవచ్చు. ఆ తరువాత అంతర్వాణి మార్గనిర్దేశంతో ముందుకు వెళుతూ బాహ్యంగానున్న 4 వేదాలను క్షుణ్ణంగా నేర్చుకోవటానికి ఏమేమి చేయాలో చేస్తూ, ఒక వివేకవంతుడు సత్య మార్గంలోని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో, ఈ చివరగా చెప్పబడిన మార్గము చాల సహజమూ మరియు మనలో చాలా మందికి అనుసరణీయమైనది. స్వామి దయానంద సరస్వతి కూడా ఈ విధానమునే పాటించి చాలా ప్రఖ్యాతి గాంచిన  వేద పండితుడయ్యారు.

వేదాలలోని చాలా మంత్రాలకు చాలా స్పష్టమైన అర్థాలు ఉండి మనలో చాలా మంది సులభంగా అర్థం చేసుకొని గ్రహించగలిగేవిగా ఉంటే, అవే మంత్రాలు మరింత మానసిక నియంత్రణతో మాత్రమే బహిర్గతమయ్యే నిగూఢమైన అర్థాలనూ కలిగివున్నాయి. ఒక మంత్రం ఏమంటుందంటే, ఏ విధంగా అనుకూలవతి మరియు నమ్మకస్తురాలయిన భార్య తన భర్తకు దగ్గరవుతుందో, అదే విధంగా వేద మంత్రాలు కూడా అర్హులకు మాత్రమే అర్థమవుతాయి. కనుక ఈ ప్రపంచంలో ఏ ఒక్కరునూ వేదాలను సరిగ్గా అర్థం చేసుకున్నామని ప్రకటించుకొనేందుకు వీలులేదు. ప్రతి ఒక్కరూ ఒక ప్రాథమిక విద్యార్థి మాత్రమే. అందుచేత, వైదిక ధర్మం స్వీకరించేందుకు సిద్ధమైన ఇతరుల పట్ల, అత్యున్నత ప్రమాణాలైన వేదాలకు కట్టుబడి ఉండటమనే ముందస్తు షరతు విధించుటకు, అసలు ఏ ఒక్కరికీ  యోగ్యత లేదు. ఇది ఎంత మూర్ఖత్వమంటే sin^2y +  cos^2y = 1 అనే సమీకరణ తెలియదనే నెపంతో ఒక విద్యార్థికి ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాన్ని తిరస్కరించటం లాంటిది.

అవును, నాలుగు వేదాలు దైవికమైనవని, వివేకం మరియు జ్ఞానములకు అవి అత్యున్నత ప్రమాణాలని మనలో చాలా మంది నిర్ధారించుకోవచ్చు. అయితే ఇది వైదిక ధర్మంలోనికి ప్రవేశించుటకు ఎంతమాత్రం ముందస్తు షరతు కానే కాదు.

అటువంటి ముందస్తు షరతు ఏదైనా ఉందీ అంటే అది ఇదొక్కటే – సత్యాన్ని గ్రహించటం,  అసత్యాన్ని త్యజించటం!

 

ఎవరైనా దైవాన్ని నమ్మకుండా కూడా వైదిక ధర్మాన్ని పాటించగలరా?

అవును, దాదాపు పైన చెప్పినటువంటి కారణాలు దీనికీ వర్తిస్తాయి. ఇంకనూ ఒక అదనపు కారణం ఉన్నది:

వేదాలలోని దైవం బైబిల్, ఖురాన్ లాంటి మత గ్రంథాలలో లేక హిందువుల పురాణాలలోని దైవం కంటే భిన్నమైనది. చాలా మంది ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముటకు తిరస్కరిస్తారో, వారు వాస్తవానికి భగవంతుడి పేరు మీద ఉన్న, మతం పేరుతో వ్యాప్తి చేయబడుతున్న మూఢ నమ్మకాలను నమ్ముటకు తిరస్కరిస్తున్నారు. పాశ్చాత్య దేశాలలోని భగవంతుడి పట్ల ఈ రోజున్న తీవ్ర నిర్లిప్తత బైబిల్ గ్రంథంలోని భగవంతుడి పట్ల మాత్రమే. ఇది సమర్థనీయమే, ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని భగవంతుడికి చాలా పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉంటాయి మరియు ఒక మానవునిలా అప్పుడప్పుడూ ప్రవర్తిస్తుంటాడు. ఐతే వేదాలలోని భగవంతుడు వేరు. నిజానికి వేదాలలోని పరమాత్మని వర్ణించేందుకు ‘దేవుడు’ అనే పదం ఉపయోగించటం సరియైనది కాదేమో.

వేదాలలోని భావన చాలా అంతర్ దృష్టితో కూడి ఉన్నది మరియు సహజమైనది – ఈ ప్రపంచాన్ని, మనల్ని శాసించే కొన్ని సనాతనమైన (మార్పు లేనటువంటి) నియమాలతో కూడియున్న ఒక ఆధారము ఉన్నది – అనే భావన. భౌతిక శాస్త్రజ్ఞులు దీనినే కేవలం ప్రకృతి నియమం అని అన్వయించుకోవచ్చు. ఐతే ఒక తెలివైన వైదికుడు దీనికి ఒక ఆధ్యాత్మిక అనుకూలతని జోడించి, ఈ సనాతన ధర్మాలయొక్క మూలాధారము, మన సరియైన కర్మల ద్వారా ఆనందాన్ని పెంచుకొనే అవకాశం కల్పించేలా ప్రవర్తిస్తున్నదని చెప్పగలడు. మనం అనాధలలా గాలికి (ఖర్మ) వదిలివేయబడలేదు, అలాగే మన కర్మల ఫలాల్ని తప్పించుకొనేందుకు కూడా వీలులేదు. కాబట్టి అందులో, ఈ ప్రకృతి ధర్మాలు న్యాయాన్నీ విశ్వాసాన్నీ నిశ్చయపరుస్తాయని, బహుచక్కగా స్థాపించబడిన ఆశావాదం ఉన్నది. మనం ఇది ఎందుకు నమ్మగలమంటే ఈ బాహ్య ప్రపంచంలో, మన అంతర్గత ప్రవ్రుత్తులలో ఈ విషయం చాలా స్పష్టంగా కనబడుతూవుంది.

అయితే ఒక వివేకవంతుడు, భగవంతుడిపై  పూర్తిగా వేరే భావజాలముతో, అనగా దైవమంటే ఒక మానవరూప పరిధి, లేదా ఒక మానసిక అస్థిరత కలిగిన చక్రవర్తి, లేదా ఒక మాంత్రికుడు మొదలైన భావనలతో కూడియున్న సమాజములో ఎదిగి వుంటే, అతనికి వేదాలలోని భగవంతుడిని అర్థం చేసుకోవటం ఒక మింగుడుపడని విషయం. అంతేకాక దైవం అనే పదానికి వైదిక దృష్టికోణంతో అర్థాన్ని అన్వయించుకొని తనకున్న అపోహలను తొలగించుకోవడమన్నది అటువంటివానికి దాదాపు అసాధ్యమైన విషయం.

ఉదాహరణకు, ‘ఆర్య’ అనునది చాల ఉన్నతమైన పదం. కాని జెర్మనీ దేశంలోని  ప్రజలు, హిట్లర్ ఉదంతం కారణంగా, ఏదో విధంగా ఈ పదాన్ని జాత్యహంకారంతో ముడిపెట్టగలరు. ఇటువంటి పదాలు కొన్ని భావోద్వేగాలకు ఆజ్యం పోయవచ్చు, ఎందుచేతనంటే అంతకు మునుపు వాటితో ముడిపెట్టబడిన విషయాల వల్ల చాలా మందికి కొత్త అర్థాన్ని తెలుసుకొనుట మరియు ఒప్పుకొనుట చాల కష్టం.

ఆ విధంగా నాస్తికత్వము అనునది ఒక సత్యాన్వేషికి, ఎయే భావనలు తన మనస్సుకి అసంబద్ధమైనవిగా  అనిపిస్తాయో, వాటిపట్ల సహజంగా కలిగిన మరియు సరిగ్గా నిర్దేశించబడిన విముఖత భావము. కనుక నాస్తికుడిగా ఉండుట చేత, అతడు (లేక ఆమె) ఇంకనూ వైదిక ధర్మాన్ని పాటిస్తున్న నిబద్ధత కలిగిన అనుచరులు అనిపించుకోగలరు.

వేరే విధంగా చెప్పాలంటే, ఏ సత్యాన్వేషియైన నాస్తికుడు లేక అజ్ఞేయవాది లేదా ఇంకేదైనా దైవ భావన కలిగిన ఒక మూఢ విశ్వాసి, ఆ నిర్దిష్ట సమయంలో వానికి ఉన్న అనుభవం, నైపుణ్యం, వివేకం మేరకు ఏ భావనలనైతే నిజాయితీగా నమ్ముతాడో, వానిని వైదిక ధర్మానుచరుడిగా పరిగణించవచ్చు.

హోమం, సంధ్యా వందనం వంటివాటి సంగతేమిటి? ఎవరైనా ఇటువంటి ఆరోగ్యకర విధానాలు పాటించక పోయిననూ వైదికంగా ఉండగలరా?

అవును. మనం ఇంతకుమునుపే కొన్ని కారణాలను పైన చర్చించాం. ఇప్పుడు ఇంకొన్ని కారణాలను చూద్దాం.

  • హోమము, సంధ్యా వందనం అనునవి చాలా ఆరోగ్యకరమైన విధానాలు, అయితే వాటి స్వరూపాలు మరియు పద్ధతులు భౌగోళికమూ మరియు సమయ సంబంధమైనవి. హోమం అంటే ఉపయుక్తమైన పదార్థాలను పర్యావరణ శుద్ధి కొరకు అగ్నిలో మండించే విధానం. సంధ్యా వందనం అనునది స్వీయ సూచనలతో కూడిన, బలమైన ఆధ్యాత్మిక శక్తులు పొందుటకై చేసే ఒక రకమైన ధ్యానం వంటిది. అయితే ఇక్కడ వేదాలు ఈ క్రతువులు చేయుటకు ఒక విశిష్టమైన పద్ధతిని నిర్దేశించలేదు. వాటి రూపురేకలు మరియు పద్ధతులు యుగాలుగా మారుతూ వచ్చాయి. కాబట్టి వైదిక ధర్మాన్ని ఎదో ఒక క్రతువులతో కూడిన ఆచార విధానంతో ముడిపెట్టటం వేదాల యొక్క అసలు ఉద్దేశానికి విరుద్ధమైనది.
  • అయిననూ, హోమము మరియు సంధ్యా వందనం వంటివి ఆరోగ్యకరమైన మనస్సు, శరీరం మరియు పర్యావరణం కొరకు యుగాలుగా ఆచరించబడుతున్న సమర్థవంతమైన పద్ధతులు. ఒకరికి ఉన్నమేథస్సు స్థాయి మరియు గత అనుభవాలను బట్టి, వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకొనేందుకు మరియు వారి స్థాయిని బట్టి  అనుకూలీకరించిన పద్ధతులను అనుసరించేందుకు సమయం పట్టవచ్చు. ఐతే అది జరిగే వరకూ, కేవలం ఒక పిడివాద మనస్కుడు మాత్రమే అటువంటి వ్యక్తులను వైదిక ధర్మము నుండి బహిష్కరిస్తాడు. దీనికి భిన్నంగా పిడి వాదులకు వైదిక ధర్మంలో చోటే లేదు.

కనుక హోమము, సంధ్యా వందనం, వేకువ జామున నిద్ర లేవటం, దంత ధావనం చేయటం, వ్యాయామం చేయటం, సరియైన పరిశుభ్రత పాటించటం, ఇవన్నీ కూడా ఒక వివేచనాత్మకమయిన సదుద్దేశంకల వ్యక్తి యొక్క లక్షణాలని ఒప్పుకోవచ్చు. కానీ ఒకరి నేపథ్యం కారణంగా వారికి వేద పాఠశాల ప్రవేశాన్ని, ఇటువంటి కర్మలు చేయుట వల్ల వారికి లభించే ప్రయోజనాలను ఎవరూ అడ్డుకునేందుకు వీలు లేదు.

  • ఇంకనూ వేదాలలో మనందరికీ ఉపయోగపడే కొన్ని వందల కొద్దీ ఆరోగ్య సంబంధమైన సూచనలున్నాయి. ఇంకా చెప్పాలంటే హోమము, సంధ్యా వందనం వంటివి చాలా కనిష్ట స్థాయిలో ఉద్ఘాటించబడినవి. సద్గుణాలైన వేకువ జామున నిద్ర లేవటం, కఠినమైన వ్యాయామం ద్వారా కండపుష్టి కల్గిన దేహాన్నిపొందడం, ధర్మాన్ని, నైతికతను పాటించే విషయంలో ఒక్క అంగుళం కూడా రాజీ పడకపోవడం, జాతి అభ్యున్నతి కోసం, శత్రువుల వినాశం కొరకు సక్రియాత్మకంగా పనిచేయటం వంటివి ఉన్నతంగా ఉద్ఘాటించబడినవి. అందుచేత మరెవరైనా ఇతర నియమాలను జతపరిచి (ప్రతి రోజూ 5 మైళ్ళు పరుగెత్తడం, 40 ఫలకాసనాలు చేయటం వంటివి) హోమము, సంధ్యా వందనం చేసే విద్యార్థులని వేద పాఠశాల ప్రవేశాన్ని రద్దు చేయవచ్చు.

Common-questions-on-Vedic-religion--

ఇందులో అర్థం చేసుకోవలసిన సులభమైన విషయమేమిటంటే ఇవన్నీ కూడా కొన్ని అంశాలను నేర్చుకునే క్రమంలో తదుపరి వచ్చే స్తాయిలే కానీ వైదిక ధర్మంలో ప్రవేశించుటకు కావలసిన ప్రవేశం-నిష్క్రమణలకు సంబంధించిన ప్రమాణాలు కాదు.

అంటే ఆర్య సమాజం వైదిక ధర్మానుసారిణి కానవసరం లేదని మీ అభిప్రాయమా?

ఆర్య సమాజం అంటే శబ్దవ్యుత్పత్తి ప్రకారము ఉన్నతులైన ప్రజల యొక్క సంఘము అని అర్థము. కనుక ఈ దృష్టికోణంతో చూస్తే, వైదిక ధర్మాన్ని పాటించేవాళ్ళందరూ ఆర్య సమాజానికి చెందినవారు. ఇక స్వామి దయానంద సరస్వతి గారు 19వ శతాబ్ధపు చివరలో వివేకవంతులైన ప్రజలను ఒక ఉపయుక్తమైన క్రియలు (పనులు) చేయగల శక్తిగా సంగటిత పరిచేందుకు ఆర్య సమాజాన్ని స్థాపించారు. కనుక అతని నిర్ణయ ప్రమాణములు చాలా మౌలికమైనవి కాదు కానీ ఒక రకమైన మధ్యమ స్థాయి కలిగినవి కావటం చేత వారు సరియైన ధర్మాలను పాటించటమే కాక ఆ ధర్మాలను బోధించే ఉపాధ్యాయులు కూడా కాగలరనే ఉద్దేశ్యముతో కూడినవి. కనుక మధ్య స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు గల వేద విద్యార్థులు అందరూ ఆర్య సమాజాన్ని ఏర్పాటు చేశారు. అందుకోసం అతను ఆర్య సమాజాని కోసమై ఒక 10 సూత్రాల నియమావళిని రూపొందించారు.

అయితే అతను చాలా ప్రాథమిక స్థాయి విద్యార్థులను కూడా దాని వైపు ఆకర్షించేందుకు పలు విధాలుగా ప్రయత్నించారు. ఆర్య సమాజ సూత్రాలను పాటించని వాళ్ళు సైతం సరియైన భావాలు (వైదిక ధర్మానుచరులు) ఉండుట మాత్రం చేత అతని చాలా ఇతర కార్యక్రమాలలో పాల్గొనే వారు. ఆ విధంగా అతని ‘పరోపకారిణి సభ’లో జస్టిస్ ‘రనాడే’ లాంటి ఆర్య సమాజానికి చెందనటువంటి ఉన్నత వ్యక్తులూ ఉండేవారు.

టూకీగా చెప్పాలంటే, ఆర్య సమాజం యొక్క 10 సూత్రాలను నిష్కపటంగా నమ్మి అర్థం చేసుకొని పాటించేవారు అందరునూ నిస్సందేహంగా వైదిక ధర్మానుచరులు అని చెప్పవచ్చు. నిజానికి వారు సమాజానికి ఒక విలువైన దీపస్తంభము (దిక్సూచి) లాంటి వారు మరియు ఈ విషయాన్ని వారు చేపట్టిన వివిధ సంఘ సంస్కరణలు, స్వాతంత్ర్యోద్యమం ద్వారా ధ్రువపరిచారు. స్వామి దయానంద సరస్వతి గారు సమాజం యొక్క సమకాలీనమైన అవసరాలను తీర్చాలనుకున్నారు. ఆర్య సమాజం, దివిటీలుగా మార్గ దర్శనం చేయిస్తూ స్పూర్తినిచ్చే సామర్థ్యం కలిగిన అర్హులైన, వేద ధర్మ విద్యార్థులకు ప్రతీక. అటువంటి వారు కనీస వివేకం, జ్ఞానం మరియు అంకిత భావం కలిగియుంటారు. వారు సమాజంలోని ఇతరులందరికీ నాయకులుగా వ్యవహరించగలరు.

అయితే పైన పేర్కొనబడిన వివిధ కారణాల వల్ల  ఈ ఆర్య సమాజపు 10 సూత్రాలను ఖచ్చితంగా నమ్మక పోయిననూ ఇతర మహాత్ములను వైదిక ధర్మం యొక్క ఉన్నతమైన అనుచరులుగా పరిగణించకుండుట తగదు. ఆ విధంగా అందరు స్వాతంత్ర్య సమారా యోధులు, సంఘ సంస్కర్తలు, మాతృ దేశం కొరకు ప్రాణ త్యాగం చేసిన సైనికులు వంటి వారందరూ వైదిక ధర్మమునకు చెందిన గొప్ప ఉదాహరణలు. నిజాయితీ గల ఆలోచనా ప్రక్రియ ద్వారా ఈ ప్రకృతి మర్మాలను, రహస్యాలను ఆవిష్కరించేందుకు ఉన్నతమైన పరిశ్రమ చేసే అందరు వైజ్ఞానికులు కూడా వైదిక ధర్మమునకు చెందిన ఉదాహరణలు.

ఒక గుర్తుంచుకోదగిన విషయం ఏమిటంటే, ఒకరు వైదిక ధర్మానుచరుడిగా ఉండటం, లేక ఉండకపోవటం అన్నది ఎప్పటికీ సంభవించదు. అది బహుశా క్రైస్తవులకు, మహమ్మదీయులకు నిజం కావచ్చు. ఒకడు  మహమ్మదీయుడు అవుతాడు లేదా కాకుండా వుంటాడు. అలాగే ఒకడు క్రైస్తవుడవుతాడు, లేదా కాకుండా ఉంటాడు. కానీ ఒకరు జీవితంలో కొన్ని విషయాలలో వైదికంగా ఉండవచ్చు, ఇంకొన్ని విషయాలలో వైదికంగా ఉండకపోనూవచ్చు. అంతేకాక ఎంతమేర నిబద్ధత ఉందన్నది సమయాన్ని బట్టి మరుతూ ఉంటుంది. కనుక వైదిక ధర్మమూ కాంతి వంటిది. ఈ విశ్వంలో ఎక్కడా కాంతి పుంజపు ‘ఫోటాన్లు’ (కాంతి యొక్క సూక్ష్మాతి సూక్ష్మ పదార్థ మూలకాలు) లేని  ప్రదేశం అంటూ ఉండదు. అయితే కాంతి యొక్క తీవ్రత స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

సరళీకరణ కొరకు మనం ఈ విధంగా చెప్పవచ్చు. ఏయే ప్రజలు వారి వారి జీవితాలలోకి వారికున్న అజ్ఞానాంధకారంతో సంబంధం లేకుండా ఈ వివేకం యొక్క కాంతిని సక్రియాత్మకంగా ఆహ్వానిస్తారో, ఆయా ప్రజలు వైదిక ధర్మానుచరులు. ఇటువంటి ప్రజలు సూర్య కాంతికై (జ్ఞాన కాంతికై), వారి వారి మూసియున్న తలుపులు ఎంత బిగుసుకొని వున్నా, వాటిని తెరిచేందుకు కనీసం తమవంతు ప్రయత్నం చేయగలిగినటువంటివారు.

ఆర్య సమాజం విషయానికి వస్తే, ఇటీవలి కాలంలో, ఆర్య సమాజం అనునది చాలా అయోమయం కలిగించే విషయమయిపోయింది. శబ్ధ లక్షణం ప్రకారమయితే ఉన్నతమైన ప్రజల (ఆర్యుల) యొక్క సమాజమని సూచిస్తుంది. అంతేకాక స్వామి దయానంద సరస్వతి గారిచే సూత్రీకరించబడిన 10 ధర్మాలను పాటించే ఆ అసలైన ఆర్య సమాజానికి చెందిన ఏంతోమంది అంకిత భావము కలిగిన అనుచరులున్నారు. వారు నిజానికి వైదిక ధర్మమునకు చెందిన ఆదర్శప్రాయులు – చాలా అధునాతన విద్యార్థులు, పరిణితి సాధించినవారు. ఏదేమైనా వారు కేవలం వ్యక్తులే.

అయితే ఆర్య సమాజం అనే పేరు గల, ఎన్నో మందిరాలను, వివిధ వ్యవస్తీకృత సంస్థలను నడిపే ఇంకో ఆర్య సమాజమున్నది. వారు బాలివుడ్ సినిమాలకి పెళ్ళిళ్ళ సన్నివేశాలకి అవసరమైన పూజారులను సమకూరుస్తారు. ఇంట్లోంచి పారిపోయి లేక లేచిపోయి వచ్చిన జంటలకి పెళ్ళిళ్ళు చేస్తూ చాలా ఆదాయం పొందుతారు. ఇటువంటి అస్థిర సంస్కృతి గల ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి గారి వారసత్వాన్ని అపహాస్యం చేయునటువంటిది, దీనిని వైదిక ధర్మమని తప్ప ఇంకేమైనా అనవచ్చు. వీళ్ళు వారి హోమాలు చేయవచ్చు, సంధ్యా వందనాలు చేయవచ్చు, ‘వైదిక ధర్మమునకు జయము’ అని గట్టిగా నినాదాలు చేయవచ్చు, మరియు పేరుమోసిన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతర గుర్తింపు కల్గిన పెద్దలు హాజరయ్యే బహిరంగ సభలు, సమావేశాలను నిర్వహించవచ్చు. అయితే వారి ఉద్దేశ్యాలు ఏమిటో  వారికి లభించే ప్రతిఫలాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకోవచ్చును. మౌళికమైన వైదిక నియమమొకటి ఉన్నది. అదేమిటంటే ఎవరైతే మాకు చాలా జ్ఞానమున్నది, సామర్థ్యమున్నదని ప్రకటించుకుంటారో వారే కఠినమైన శిక్షలు పొందుటకు కూడా అర్హులు అనునది. వివరాలకు ఈ వ్యాసం చదవండి.

http://agniveer.com/4272/manu-smriti-and-punishment/

The 4 Vedas Complete (English)
The 4 Vedas Complete (English)
Buy Now

ఇంకొక సూత్రమేమిటంటే మోసగాళ్ళను కనీసం మాటలతో కూడా గౌరవించకూడదనునది. కనుక ఈ ఆర్య సమాజం – ఏదైతే ఒక ఉమ్మడి నిధి కలిగినట్టి జూద గృహం కంటే మెరుగైనది కాదుగనుక – మొత్తం జనాభాని వైదిక ధర్మముతో సమన్వయము చేసే ప్రాతిపదిక ఆధారంగా విశ్లేషిస్తే, కనిష్ఠ స్థాయి అత్యల్ప మార్కులను మాత్రమే పొందుటకు అర్హత కలిగినది.

మా సూచన ఏమిటంటే, వైదిక ధర్మము ననుసరించుట ద్వారా, నిజాయితీగా మీ మీ జీవితాలను మార్చుకొని సమాజాన్ని కూడా మార్చుటకు, ఇటువంటి జూద సమానమైన సంబరాలకు దూరంగా ఉండాలి.

నేను ‘సత్యార్థ ప్రకాశ్’ లేదా ‘అగ్నివీర్’ వెబ్ సైట్లో వ్రాయబడిన విషయాలన్నింటినీ అంగీకరించను. నాకు భేదాభిప్రాయాలున్నాయి. నాకు ఇంకో విధమైన పూజా విధానం ఎక్కువ ప్రభావవంతంగా అనిపిస్తున్నది. అయినప్పటికీ నేను వైదిక ధర్మానుచరుడినేనా?

ఇంతకుమునుపే చెప్పబడిన విధంగా, మీ హక్కు ఎప్పటికీ మీకు ఉంటుంది. అగ్నివీర్ వెబ్సైట్ ను తిరస్కరించుటకు మాత్రమే కాదు,  ఏ సత్యార్థ ప్రకాశ్ గ్రంథం అగ్నివీర్ వ్యాసములకు మూలమో దానిని, అంతే కాదు, మొత్తం నాలుగు వేదములను కూడా తిరస్కరించుటకు మీరు స్వతహాగా హక్కును కలిగియున్నారు. అయితే ఒకేఒక్క ప్రమాణం ఏంటంటే మీరు ఆ విధంగా భిన్న వాదన చేయటం లేదా ఏకంగా తిరస్కరించటం అన్నది పూర్తి నిజాయితీతో ఎటువంటి అరమరికలు లేకుండా పక్షపాత వైఖరి లేకుండా చేయగలగాలి. అదెలా ఉండాలంటే మేము ఈ విషయాన్ని ఎన్నో ఏళ్ళుగా లేక నెలలుగా నమ్ముతున్నామనీ, లేక మేము ఆ విషయాన్ని సమర్థిస్తూ ఏవో బహిరంగ వ్యాఖ్యలు చేశామనీ, లేక ఇది మా వృత్తులకు భూమికనీ, లేక మేము పరిహాసమునకు గురవుతామనీ, లేక మా ధోరణి/తీరును మార్చుకుంటే శిక్షింపబడాతామనీ, మొదలైనటువంటి కారణాలతో ఏ విషయాన్నీ విభేదించకూడదు.

మనం దేనినైతే అంతర్గతంగా నిజాయితో నమ్మి అంగీకరిస్తామో, అటువంటి ప్రమాణం చేత మాత్రమే వేరొక కొత్త విషయాన్ని విభేదించవచ్చు.  తరువాత, మనం ఎల్లప్పుడూ ఏదైనా భవిష్యత్తు మార్పుల కొరకు ఒక ద్వారాన్ని తెరిచే ఉంచాలి ఎందుకనగా రేపు మనకు ఇంకా కొత్త సమాచారమో లేదా వేరే ఇతర విషయాలో లభించేందుకు ఆస్కారమున్నది. వాటిని మనం పరిశీలించి, విశ్లేషణ చేసుకొనే వీలు కూడా ఉన్నది.

ఇటువంటి సహజమైన మార్గం ద్వారా మాత్రమే మనము పరిపక్వతను సాధించగలము. లేనియెడల మన మెదళ్ళు 4 సంవత్సరాల వయస్సు వరకూ ఎదుగుతూ వచ్చి, ఆ తరువాత ఇంకెప్పటికీ ఎదగకుండా మొద్దుబారిపోయుండేవి. కనుక వైదిక ధర్మము అంతయూ కూడా ప్రకృతితో సారూప్యంతోనుండి, దురహంకారము లేకుండా జీవనం సాగించుటయేనని తెలియజేస్తుంది.

వైదిక ధర్మం ఏ విధంగా ఇతర మతాలూ వాటి సిద్ధాంతాలు సంప్రదాయాల కంటే భిన్నమయినది?

అన్ని మతాలూ వాటి సంప్రదాయాలూ ఒక విధమైన ‘సమూహ ఒప్పందాలు’గా (ప్యాకేజీలుగా) వుంటాయి. మీకు కొన్ని ప్రధానమైన నమ్మకాలు, కొన్ని పవిత్ర గ్రంథములనబడే పుస్తకాలు, కొందరు ప్రవక్తలు, కొందరు పూజారులు/సన్యాసులు, కొన్ని ఆచారాలు, మరియు కొన్ని జోస్యాలు వంటివి ఉంటాయి. మీరు అన్నింటినీ ఒప్పుకొని తీరాలి. లేదా వారి మతము నుండి కానీ సమాజాన్ని నుండి కానీ మిమ్మల్ని వెలివేస్తారు. నిజానికి మీరు వాటిల్లో కొన్నింటిని మాత్రమే మానసికంగా ఒప్పుకున్నా బహిరంగంగా మాత్రం ఆ మొత్తం సమూహ విషయాలన్నింటినీ ఒప్పుకుంటున్నట్లు ఇతర ప్రజలకు ప్రకటించాలి. అంటే ఒకరకంగా అసత్యాన్ని సమర్థిస్తూ ప్రచారం చేయటమే. మీరు తప్పకుండా వాటి పట్ల మీ నిబద్ధతను చాటాలి. ఒకవేళ మీకు నచ్చకున్నా, వాటిని మీకు మీరు ధ్రువీకరించుకోలేక పోయినా, తార్కికంగా అర్థం చేసుకోలేక పోయినా, అవి సహేతుకమైనవని అంగీకరించలేక పోయినా, వాటన్నింటినీ మీరు ఒప్పుకొని తీరాలి లేదా బయటకు పోవాలి.

అయితే వైదిక ధర్మం ఇటువంటి సమూహ ఒప్పందాల నమూనాకు భిన్నంగా అందరికీ సరిగ్గా ఇమిడిపోయేలా రూపొందించబడినది. మీకు ఏవి తార్కికంగా బలమైన విషయాలుగా అనిపిస్తాయో, ఏవి సహేతుకంగా ఉన్నట్లు కనబడతాయో, ఏవి అంతర్గతమైనవిగా ఉండి మీకు సులభంగా అర్థమవుతాయో, వాటిని మాత్రమే మీరు నమ్ముతారు. మీరు ఏ ఒక్క పుస్తకానికో, ఒక సన్యాసికో, ఒక స్వామిజీకో, ఒక నమ్మకానికో కూడా మీ విధేయతను ప్రకటించకుండా ఉండవచ్చు లేదా తిరస్కరించవచ్చు. అలా చేసినప్పటికీ మీరు నిజాయితీగా ఉన్నంతవరకూ వైదికంగా ఉన్నట్లు పరిగణించవచ్చు.

ఇతర అన్ని మతాలూ, మాట సంప్రదాయాలూ ద్వియాంశ (ద్వంద్వ – ఇది లేక అది) తర్కాన్ని కలిగియుండి తదనుగుణంగా పని చేస్తాయి. మీరు అవ్వగలిగితే వారిలో ఒకరు లేదా వారికి చెందనటువంటి వారు. వైదిక ధర్మం అటువంటి మూఢ మాట సంప్రదాయము కాదు. మీరు సహజంగా వైదికులే. ఇక మీ భావాలూ, ఉద్దేశాలను బట్టి మీరు జీవితంలో కొన్ని అంశాల్లో అధికంగా లేక ఇంకొన్ని అంశాల్లో అల్పంగా వైదికులుగా ఉంటారు. ఇది మీకు, ఆ మహా శక్తికి (పరమాత్మ, దేవుడు, ఈశ్వరుడు, ప్రకృతి నియమాలు అని ఏ పేరైనా పెట్టుకోండి) సంబంధించిన విషయం, మరియు ఇందులో ఎవ్వరికీ  కూడా మీ గురించి, వైదిక ధర్మముపై మీకున్న నమ్మకం లేక అపనమ్మకం గురించి తీర్పులు చెప్పుటకు హక్కు లేదు.

వైదిక ధర్మము మానవ జాతికి చెందిన అత్యంత పురాతనమైన 4 వేదముల ప్రేరణతో రూపొందించబడినది. అది కేవలం సనాతన (ఎప్పటికీ మార్పు చెందని) ధర్మాలను మాత్రమే పరిగణించి మిగిలిన భౌగోళికమైన, కాల సంబంధమైన, ఒక వ్యక్తీ లేదా సమాజ సంబంధమైన విషయాలను విస్మరిస్తుంది. ఇంకనూ 4 వేదముల పట్ల విధేయతను ప్రకటించమని అస్సలు ఆజ్ఞాపించదు. వేదం అంటే జ్ఞానము, జ్ఞానోదయము అని అర్థం. కనుక జీవనంలో ఏయే మార్గాలు లాభదాయకమైనవో  ఆయా మార్గాలే వైదిక ధర్మము.

మీరు ఒకే సమయము నందు మహామ్మదీయులుగా మరియూ క్రైస్తవులుగా, ఆయా మత నియమముల ననుసరించి, రెండింటికీ చెందిన వారయ్యుండేందుకు అస్సలు ఆస్కారమే లేదు. కానీ మీరు మహామ్మదీయులైనా, క్రైస్తావులైనా, హిందువులైనా, యూదులైనా, లేక మరేదైనా, మీరు ఏకకాలంలో వైదికులు కూడా కాగలరు.

ఇతర అన్ని మతాలూ గుడ్డిగా కొన్ని ఆచారాలను, భావనలను నమ్మమనే అర్థాన్నిస్తాయి. వైదిక ధర్మం మాత్రం అత్యంత ధీరత్వంతో కూడిన నిజాయితీతో జీవించటమనే అర్థాన్నిస్తుంది.

 

కనుక మీ వైదిక ధర్మానికి ఒక ఆధారము, కొలమానాలు, ఒక పునాది లేవన్నమాట. ఎవరు వారికి ఇష్టమొచ్చింది వారు చేస్తూ కూడా వైదికులుగా ఉండవచ్చన్నమాట. హూ! వేరే ఏదైనా ఎక్కువ  క్రమశిక్షణతో కూడిన క్రైస్తవం, ఇస్లాం లాంటి మత సంప్రదాయాలను పాటించటం మేలేమో అనిపిస్తున్నది.

 

ఇటువంటి నిరాశావాదము మనము మానసిక ఖైదీలుగా ఉన్నామని సూచిస్తుంది. ఒక ఖైదీని ఓకే చీకటి కారాగారంలో ఎక్కువ కాలం ఉంచితే ఆటను సూర్య కాంతినిచ్చే స్వాతంత్ర్యాన్ని కూడా భరించలేనిదిగా భావిస్తాడు. కొద్ది మంది దోషులు స్వతంత్రపు జీవితాన్ని అసౌకర్యంగా భావించి ఆత్మా హత్యలకు పాల్పడిన ఉదంతాలూ ఉన్నాయి. ఎవరైనా పక్కవారు వారిస్తే తప్ప వారు స్వతహాగా ఉపశమనం పొందలేకపోయేవారు. వైదిక ధర్మము ఖచ్చితంగా కారాగార ప్రియుల కోసం కానే కాదు. అది ఎవరిని వారు బంధ విముక్తులను చేసుకొవాలనుకునే వారికి  ఉద్దేశించబడినది.

అయితే వైదిక ధర్మం క్రమశిక్షణా రాహిత్యంతో ఉండమని సూచించదు. దానకి బదులుగా హేతుబద్ధమైన క్రమశిక్షణతో ఉండమని సూచిస్తుంది. కనుక, ఉదాహరణకు మీకు ఒకవేళ అది చాల ఆనందకరమైన విషయంలా అనిపించినా కామానికి లొంగిపోవటం వంటివి  వైదిక ధర్మం కాదు. దీనికి బదులు వాస్తవాన్ని గుర్తించటం వైదిక ధర్మం. వైదిక ధర్మము, మనకివ్వబడిన మనస్సు నుపయోగించి వివిధ పరిణామాలను గూర్చి ఆలోచించి, మానసిక విశ్లేషణ చేసి, “ఇలా ఐతే ఎలా?” అని ప్రశ్నించుకొని, వివేకాన్ని పొందమని సూచిస్తుంది.

ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ నాలానే కామానికి లొంగిపోతే ఎలా? ఎవరైనా నా తల్లి కోసమో, చెల్లి కోసమో కామోద్రిక్తులవుతే ఎలా? నేను ఏ విధంగా కామాన్ని ఆనందంగా భావిస్తానో, ఇంకొకరు హత్యలు చేయటాన్ని అలాగే భావిస్తే ఎలా?

ఈ విధంగా ప్రశ్నించుకోవటం వల్ల వివేకాన్ని పొందటం, ఆ విధంగా తన మనస్సుయొక్క శిక్షకుడు తానేనన్న సత్యాన్ని గ్రహించటం జరుగుతుంది. అలా మనస్సును సరిగ్గా నియంత్రించ గలిగితే, ఎవరైనా వారు కోరుకున్న విషయం పట్ల ఆనందాన్ని ఆశించవచ్చు.

కనుక ఒక వివేకవంతుడైన, చురుకైన శిక్షకుడిలా నా మనస్సును నియంత్రించి, నేను ఏదైతే నాకు దీర్ఘ కాలిక దృఢత్వాన్నీ, తేజాన్నీ, శక్తినీ ఇస్తుందో దానియందు అమితానందాన్ని పొందాలని కాంక్షిస్తాను, అంతేకానీ దీనికి విరుద్ధమైన మార్గంలో మాత్రం కాదు. నేను ఎటువంటి విషయాలలో ఆనందాన్ని ఆశిస్తే, ఈ ప్రపంచములోని ప్రజలందరూ వాటియందే ఆనందాన్ని ఆశించినా,  తద్వారా ఈ ప్రపంచము ఇంకా అందమైన, సంతోష దాయకమైన ప్రదేశంగా మార్పు చెందాలి.

వైదికులు ఇలా ఆలోచించి, ప్రవర్తిస్తారు గనుక ఇటువంటి వివేకవంతమైన ఎదుగుదల, అభివృద్ధి, ఇతర సంప్రదాయ బద్ధమైన మూఢ మతాచారముల కంటే ఏంటో క్రమశిక్షణతో కూడియున్నది.

 

నేను ఎలా మొదలుపెట్టగలను?

మీరు ఏ మతం నుండైనా లేక సమాజమునుంచైనా మంచి క్రతువులను (ఆచారాలు) స్వీకరించవచ్చు. వైదికంగా మారడమనేది ఏ విధంగానూ మీరు క్రైస్తవులుగా, మహామ్మదీయులుగా లేక నాస్తికులుగా పరిగణింప బడటానికి అవరోధం కాబోదు. మీరు కేవలం ఉన్నతమైన ఆచారాలను, పద్ధతులను మాత్రమే మీకు కోరుకున్న మతం నుండి స్వీకరించి, మిగిలిన వాటిని విస్మరించండి. మీరు ఇప్పటి నవ సమాజంలోని వ్యక్తులుగా ఇప్పటికే అలా చేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచములో ఎవ్వరూ కూడా బైబిల్, ఖురాన్ లాంటి మాట గ్రంథాలలోని ప్రతి విషయాన్నీ తు.చ. తప్పకుండా పాటించలేరు, అది సాంకేతికంగా, ఆచరణాత్మకంగా అసాధ్యమైన విషయం. కాబట్టి మీరు ఇప్పటికే మీరు పాటిస్తున్న మతమును, మీ గ్రంథములలోని విషయములను మీ అవసరాలకు తగినట్లుగా అనుకూలీకరించుకున్నారు. దీనినే ఇంకొక అడుగు మరింత ముందుకు తీసుకెళ్ళండి. అదేదో గత్యంతరం లేక చేసుకొనే అనుకూలీకరణ కాకుండా మీ జీవనానికి బహు చక్కగా ఇమిడిపోయేలా అవసరమైన అనుకూలీకరణ చేసుకోండి.

ప్రతి విషయాన్నీ నిస్సంకోచంగా కుండ బద్దలు కొట్టినట్లుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి – నేను ఇది ఎందుకు పాటిస్తున్నాను? కేవలం నేను ఇక్కడ పుట్టినందుకేనా, నేను సామాజికంగా ఈ విధంగా చేయుటకు శిక్షితుడనైనందుకేనా, లేక ఇంకేదైనా కారణముందా? మీకు లభించే సమాధానాలను బట్టి, ఏవేవి మీకు తప్పుడు విషయాలుగా అనిపిస్తాయో వాటన్నింటినీ విస్మరించండి. ఏవి తర్కానికి నిలబడవో వాటిని తిరస్కరించండి. ఆ విధంగా చేస్తూ పోతే మీరు క్రమ క్రమంగా సత్యానికి చేరువగా వస్తారు. అప్పుడు మీకు మిగిలేది మీకొసమై మీకు నచ్చిన విషయాలతో కూడుకున్న ఒక విశిష్టమైన అనుకూలీకరించబడిన మతము. అది కేవలం మీకోసమే, మీచే తయారు చేయబడినది.

ఇటువంటి మీ సొంతమైన అనుకూలీకరించబడిన మతాన్ని మీరు జీవితంలో ఎప్పటికీ అభివృద్ధి చేసుకుంటూ పోవచ్చు. అది మీకు అత్యంత ఆనందకరమైన వాంఛ అవ్వడమే కాక మీ నిజ స్వరూపాన్ని మీరు తెలుసుకునేందుకు తోడ్పడుతుంది. ఈ మీ ప్రక్రియలో మీరు మీ మార్గమంతయూ వైదిక ధర్మమును పాటించినవారై ఉంటారు.

కనుక, మీకు ఏది సౌకర్యవంతంగా అనిపిస్తుందో దానితో మొదలుపెట్టి, మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే, మీరు చేసే పనిలో క్రమశిక్షణనే కాక గాంభీర్యతను కూడా కలిగియుంటారు.

ఇంకొక విధానమేంటంటే అన్ని మతాలలోని మంచి అంశాలను మాత్రమే తీసుకొని, ఆయా మతాలలోని సంప్రదాయ సంబంధమైన అంశాలను త్యజించి, మీ కోసమై అనుకూలీకరించబడిన మతాన్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు అన్ని మతాలూ సత్యం, శాంతి, నిజాయితి, జాలి, కరుణ వంటి విషయాల గురించి వ్యాఖ్యానిస్తాయి. ఇటువంటి మంచి విషయాలను వెంటనే మీరు పరిగణలోకి తీసుకుంటే, మీకై మీరు తయారు చేసుకోవాలన్న సరళమైన, ప్రభావవంతమైన, అనుకూలీకరించబడిన, వ్యక్తిగత మతమును రూపొందించుకొనుటకు మొదటి మెట్టు అవుతుంది.

ఒక వేళ మీలో ఎవరైనా, ఈ అనుకూలీకరణలు ఎందుకు, ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదని సతమతమవుతుంటే, ఇప్పటికే అలా తయారు చేయబడిన క్రమశిక్షణతో కూడియున్న ప్రత్యామ్నాయము   కోసం చూస్తూంటే, మీకు స్వామి దయానంద సరస్వతి గారిచే రూపొందించబడిన సూత్రాలు (ధర్మాలు) చాలా మంచి ఆరంభాన్నిస్తాయి. ‘సత్యార్థ ప్రకాశ్’ (ఆంగ్లంలో ‘లైట్ అఫ్ ట్రూత్’) గ్రంథాన్ని మీరు చదవండి. లేదా మా ఈ అగ్నివీర్ వెబ్సైటు వ్యాసములను చదవండి లేదా మమ్మల్ని సంప్రదించండి.

ఆ విధంగా మీకొక హేతుబద్ధమైన క్రమశిక్షణతో కూడిన రోజువారీ నియమావళి అందుబాటులో నుండటమే కాక అది మీ ఆరోగ్యాన్నీ వివేకాన్నీ పెంచుకొనేందుకు తోడ్పడుతుంది. కనుక మీరు అంతర్జాలము (ఇంటర్నెట్) నుండి ‘సత్యార్థ ప్రకాశ్’ గ్రంథమును దిగుమతి (డౌన్లోడ్) చేసుకోండి. చక్కని ఏకాగ్రతతో ఈ పుస్తకాన్ని చదివి, సమీక్షించుకోండి. ముఖ్యంగా 7వ అధ్యాయం తరువాతి విషయాలను శ్రద్ధగా చదవండి. ఇంకా అగ్నివీర్ వ్యాసాలను చదవండి. అలా చేయటం ద్వారా మీకు మీరే నిపుణులుగా తయారయ్యేందుకు, మీ ప్రారంభానికి కావలసిన అంశాలు, సమాచారమూ లభిస్తాయి. మీకు ఏవైనా ప్రశ్నలుంటే మమ్మల్ని అడిగేందుకు అగ్నివీర్ వెబ్సైటు లోని చర్చల్లో పాల్గొనండి.

 

(గమనిక: ఇది ఒక సలహా మాత్రమే. కానీ ఏ విధమైన నిర్భంధమూ లేక ఒత్తిడీ లేదు. వైదిక ధర్మం యొక్క గొప్పతన మేమిటంటే ఇక్కడ ఎటువంటి నిర్భంధమూ ఉండదు. ఉన్నదంతయూ జ్ఞానోదయము మాత్రమే! మా ఈ వ్యాసాలన్నీ మరియు సత్యార్థ ప్రకాశ్ గ్రంథమూ మన మనస్సుల్లో ఉత్పన్నమై, అడగడానికి భయపడే/సంశయపడే అవకాశమున్న ప్రశ్నలను సంకలనం చేసి వాటికి ఒక తార్కిక విశ్లేషణ చేయటమే.)

వైదిక ధర్మం నాకు ఏ లాభాలను చేకూరుస్తుంది?

ఈ ప్రశ్న అడగటం ఎటువంటిదంటే, “నాకు గాలీ, నీరూ ఏమిస్తాయి?” అని అడగటం వంటిది. మీ మేథోపరమైన మనుగడ మీ జ్ఞానాభివృద్ధి మీదే ఆధారపడి ఉంటుంది. ఇక మానవులకు జ్ఞానాభివృద్ధి వల్ల కలిగే ఆనందము ఇతర రూపాల్లో పొందే ఆనందము కన్నా ఎన్నో రెట్లు అధికముగా ఉంటుంది. ఈ కారణం చేతనే కాబోలు మానవులు జంతువుల్లా కేవలం ఆహారం, మైథునం (శృంగారం) మరియు నిద్ర కోసమే ఉన్న సమయాన్నంతా వెచ్చించకుండా, పలు నాగరికతలు కూడా నిర్మించగలిగారు. కనుక వైదిక ధర్మము మీరెన్నడూ ఊహించని ఆనందపు స్థాయిలను బహిర్గతం చేసుకునేందుకు మీకు సహాయపడుతుంది.

వైదిక ధర్మమంతయూ మీ సంకల్పములతో మీ లక్ష్యాలను చేరుకొనుట గురించే ప్రస్తావిస్తుంది. వైదిక ధర్మానుచరుడు దేనినీ విధికి వదిలి వేయడు. మీరు కోరుకుంటారు, మరియూ సాధిస్తారు. మీరు మనశ్శక్తిని ఉపయోగించి మీరు కోరుకున్న వాటిని ఎలా పొందాలో నేర్చుకుంటారు. వైదిక ధర్మం కాకుండా ఇంకేదీ మీకు ఈ నైపుణ్యాలను ఇంతకంటే మెరుగ్గా నేర్పలేదు.

వైదిక ధర్మము మిమ్మల్ని పూర్తిగా నిర్భయులుగా మార్చివేస్తుంది. మీ స్వీయ (సొంత) ఉద్దేశాలు తప్ప ఇంకేవీ మిమ్మల్ని బాధించవని మీకు తెలియజేస్తుంది. ఇంకా మీ స్వీయ ఉద్దేశాలు  మీ నియంత్రణలోనే ఉంటాయని కూడా మీరు తెలుసుకుంటారు. కనుక వైదిక ధర్మానుచారుల కంటే  ధైర్యంగా ఇంకెవ్వరూ ఉండరు. ఏ భూతమూ, ప్రేతమూ, దెయ్యమూ, శకునమూ, శాపమూ, దిష్టీ, ముప్పూ, లేదా ఒక రక్త పిశాచి, మంత్రగత్తె, జాతకమూ, హస్త రేఖలూ వంటివి వైదిక ధర్మానుచరులను భయపెట్టలేవు, ప్రభావితం చేయలేవు. వారు నిర్భయావతారములు.

వైదిక ధర్మము ఎల్లప్పుడూ మీరు సానుకూలముగా భవిష్యద్వాద ఆధునిక వ్యక్తులుగా ఉండునట్లు భరోసానిస్తుంది. ఒక వైదికుడు ఎన్నడూ అపరాధ భావ ప్రతిబంధకములలో చిక్కుకోడు. అతనికి తన వర్తమానము, మునుపటి క్షణం వరకూ గల తనయొక్క  భావాల, ఉద్దేశాల ఫలితమేనని తెలుసు. మరియు అతని భవిష్యత్తు ఇప్పటి ఉద్ధేశాలతో, భావాలతో ప్రభావితమవుతుందని కూడా తెలుసు. ఆ విధముగా అతడు తన వర్తమానంలో మంచి ఆలోచనలు, ఉద్దేశాలను కలిగియుండటం ద్వారా తన భవిష్యత్తును అందముగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేస్తాడు. అతడు ఎన్నటికీ గతాన్ని తలుచుకుంటూ లేదా అపరాధ భావ ప్రతిబంధకములలో చిక్కుబడిపోయి ప్రయత్నాన్ని విరమించే విధంగా సమయాన్ని వృథా చేసుకోడు.

వైదిక ధర్మం మీకున్న పలు సంబంధాలను మీరు ఆనందించేలా చేస్తుంది. మీరు ప్రతి విషయాన్నీ భగవంతుడు ఇప్పటివరకూ మీరు చేసిన మంచి ఆలోచనలు, ఉద్దేశాలకు ప్రతిఫలముగా ఇచ్చిన బహుమతులుగా పరిగణిస్తారు. మీరు అన్ని సంబంధములనూ మెరుగుపరచుకునేందుకు  ప్రయత్నిస్తారు, చిత్తశుద్ధితో వాటిని ప్రేమిస్తారు మరియు ఆనందమును పొందుటకు అదొక్కటే మార్గము కనుక, వాటి గురించి సానుకూలముగా ఆలోచిస్తారు. మీరు మీ కుటుంబము, సమాజము, ప్రపంచముల శ్రేయస్సు, సంతోషం కొరకు, ఉపయోగకరమైన, శ్రేష్ఠమైన పనులు చేస్తారు. అలా చేయటం మీకు ఇంకా ఆనందాన్నిస్తుంది. ఆ విధంగా మీ ఆనందం అధికమవుతూ ఉంటుంది. ఈ ప్రపంచం మీకు పూరిగా ప్రేమ మరియు విజయముతో కూడుకొనియున్న స్వర్గములాగా ఉంటుంది.

వైదిక ధర్మము మిమ్మల్ని మీరు సంపూర్ణ వ్యక్తులుగా రూపొందించుకునేందుకు దోహదపడుతుంది. మీరు మనశ్శక్తి స్థాయిలో పని చేస్తారు, ప్రవర్తిస్తారు గనుక మీరు ఒక క్షేత్రం నుండి మరో క్షేత్రమునకు మీ నైపుణ్యాలను సులభంగా మళ్ళించగలుగుతారు. ఆ విధంగా మీరు అన్ని విధాలుగా నైపుణ్యం కలవారవుతారు.

వైదిక ధర్మము, ఎటువంటి బుద్ధిహీనమైన మూఢ చర్యలకు మీరు పాల్పడకుండా ఒక సహజమైన నిరోధకతని అభివృద్ధి చేసుకునేందుకు మీకు సహాయ పడుతుంది. మిమ్మల్ని మీరు కామము, మోహము, దురాశ, చికాకు, కోపము, అసూయ, మొదలగు వాటి నుండి దూరముంచుకొనుటకు, మీరు ఇంకెంత మాత్రమూ, ఎదో అద్భుత శక్తి మిమ్మల్ని శిక్షిస్తుందనే భయంతోనో  లేదా భవిష్యత్తులో గొప్ప సుఖాలని, ఆనందాలనీ ఇస్తుందనే నమ్మకములతో ఉండవలసిన పని లేదు.

దీనికి భిన్నంగా, వైదిక ధర్మము, ఏ విధంగా ఇటువంటి బుద్ధిహీనమైన పనులు ఇంకా ఎక్కువ సమస్యలను సృష్టిస్తాయో నేర్పుతుంది. మీరు సహజంగానే ఎక్కువగా ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, స్వల్పకాలిక, దీర్ఘ కాలిక సంతృప్తినిచ్చే విషయాల (మూలముల) వైపు మొగ్గు చూపుతారు. మీరు ఇంకెంత మాత్రమూ, క్షమాపణలు చెప్పుకుంటూ పశ్చాత్తాపముతో ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన పరిస్థితి రాదు లేదా అవసరము కలగదు. మీరు చాల తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు కనుక, ఎందుకు, ఎలా మురికి కూపములో పడకుండా నివారించుకోవాలో ముందుగానే తెలుసుకొని యుండుట చేత, సరియైన కర్మలను మాత్రమే చేస్తూ, జీవితాన్ని ఎక్కువగా ఆనందిస్తారు.

వీటన్నిటికంటే, వైదిక ధర్మము మీకు ఉత్కృష్టమైన శాంతినిచ్చి, ప్రకృతితో మీకు సారూప్యతను కలిగిస్తుంది. ప్రతి సందర్భాన్నీ, క్షణాన్నీ మీరు మునుపటితో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువగా అనందించ గలుగుతారు. అటువంటి స్థితి, పూర్తిగా ఉత్సాహం, కర్మ సానుకూలత, ఆరోగ్యం, మరియు శక్తులతో కూడియున్న ఆనందమయ స్థితి. మీ నిద్రలో ప్రశాంతత ఉంటుంది. మీ నడక ఉత్తేజమూ, రాజసముతో ఉంటుంది. మీ చర్యలు చైతన్యవంతముగా ఉంటాయి, మీ అలోచనలు నిష్కల్మషంగా, పవిత్రంగా వుంటాయి. మీ ఆరోగ్యం అద్భుతంగా వుంటుంది, మరియు మీ ఆసక్తి, ఉత్సాహములు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాపిస్తూ వారినందరినీ ప్రభావితం చేస్తాయి. మీరు శాంతికి, ఆనందానికీ ఒక నిర్వచనమవుతారు.

ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోవచ్చు. అయితే ఇదంతా మీరు ఇప్పటికిప్పుడే అనుభవించేందుకు సిద్ధంగా ఉంచబడినది. ఇంకెందుకు ఆలస్యం. శక్తిమంతులు అవ్వడానికి వెంటనే మీ ప్రయాణమును మొదలు పెట్టండి. మీరు చేయవలసిందల్లా ఈ ఒక్క అంశానికి కట్టుబడి ఉండటమే!

“నేను ప్రతి క్షణం, నిరంతర సాధనా ప్రక్రియ ద్వారా ప్రతి విషయాన్నీ నాకున్న సర్వ శక్తి సామర్థ్యాలతో, నిజాయితీగా పరిశీలించి, విశ్లేషించి, సత్యాన్ని మాత్రమే గ్రహించి, అసత్యాన్ని త్యజిస్తానని నాకు నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్నాను.”

మీరందరూ కూడా వైదిక ధర్మమును స్వీకరించి అనుసరించుట ద్వారా, ఋగ్వేదము నందలి ఈ శ్లోకము యొక్క సజీవ ఉదాహరణలు అయ్యెదరు గాక!

నేను ఎన్ని అద్భుత శక్తులను పొందానంటే ఈ ప్రపంచములో నన్నెవ్వరూ నిలువరించలేరు. ఏ విధంగా శక్తివంతమైన అశ్వాలు రథములను కోరుకున్న చోటుకి తీసుకెళ్ళగలవో, నేను కూడా ఏది కోరుకుంటానో దానిని సాధిస్తాను. ఎంతటి అవాంతరము, ప్రతిబంధకములు ఎదురైనా నేను వాటిని అవలీలగా ద్వంసము చేయగలను. నేను చరిత్ర గతిని మార్చగలను, భవిష్యత్తుకై ఒక్క ఉన్నతమైన ప్రాధాన్యతను ఎర్పరచగలను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నేను జ్ఞానము, వివేకముల మార్గమును అనుసరించుటకు నిర్ణయించుకున్నాను. (ఋగ్వేదము 10.119)

మీకు వైదిక ధర్మానుచరులము కాగలమని విశ్వాసము కలిగి వుంటే, ఈ క్రింది ‘విమర్శల విభాగం’ లో మీ నిశ్చయాన్ని తెలియబరచి ఇతరులకి స్పూర్తిని కలిగించండి. ఆనందము పంచుకునే కొద్దీ ఎక్కువవుతుందనే సిద్ధాంతాన్ని గుర్తుంచుకోండి.

The 4 Vedas Complete (English)
The 4 Vedas Complete (English)
Buy Now

Facebook Comments

Join the debate

7 Comments on "వైదిక ధర్మం పై సాధారణంగా అడిగే ప్రశ్నలు"

Notify of
avatar
500

Venugopal
Venugopal
1 year 8 months ago

if ur a hindu, if ur a cristian. or if ur a muslim what ever may be we all have one father that is god. god not have any religian like hindu, cristisanity, muslim. i think vedas are not belongs to any religian, its for hole people. like god

praveen
praveen
2 years 4 months ago

నమస్తే,

తెలుగులో అగ్నివీర్ వారు వ్యాసాన్ని ప్రచురించడం చాలా సంతోషంగా ఉంది. నాలుగు వేదాలు తెలుగులో లభిస్తే చాలా బాఉంటుంది.

ఫ్రవీన్ కుమార్.

bala
bala
2 years 11 months ago

Hello Sir,
I have a small question.. Is there any differences between hindu and vaidikha ??

harish
harish
2 years 11 months ago

yes ,hindu is one who also relies on puranas whereas Vedic only stick to vedas..4 Vedas are only revealations of God and none else not even Upanishads etc.

Naveen
Naveen
3 years 27 days ago

Another great work by Agniveer Team. This article can be easily spread among telugu people. Thanks

ramnarayan
ramnarayan
3 years 1 month ago

Agniveer ji aapko bahut dhanyawaad.
అగ్నివీర్ గారికి మా ధన్య్వదాములు

తెలుగు వారందరికీ వేద సాహిత్యమూ దాని మహత్యము తెలుసు కునేందుకు ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నా

NAshwin
NAshwin
3 years 1 month ago

Nice to see a post in telugu by Agniveer.
I was waiting for this.
Thanks.

wpDiscuz